స్వరాభిషేకం



అక్షరం స్వరమై చెవులని తాకేవేల,
కలిగే ప్రతి అనువు స్పందన ఒక స్వరాభిషేకం
కలం జాలువార్చే అక్షరాల మాలిక ఒక పాట
ఆ పాటకి ఊపిరి పోసిన మనిషికి చేసే అబిషేకం మా ఈ స్వరాభిషేకం

సందేశం

  1.  గాలిలో వెలిగించిన దీపాన్ని ఆరిపోకుండా చూడటం ఎంత కష్టమో, అబద్దాలపై నిలిపిన ఏ విషయాన్ని అయినా కాపాడుకోవటం కూడా అంతే కష్టం.  ఎందుకంటే, అబద్దానికి ఆయుషు తక్కువ కాబట్టి, మరిన్ని తప్పుల్ని చెయ్యటానికి ప్రోత్సహిస్తుంది. అది అబద్దం అని గ్రహించిన రోజున అయిన వాళ్ళందరిని దూరం చేస్తుంది. కాబట్టి అబధాన్ని ఎక్కడా వాడకు. ఆత్మీయత చూపించ వాళ్ళకి దూరం అవ్వకు.
  2. మనిషి చివరి శ్వాస వరకూ తోడు వచ్చేవి, మనలోని భావాలు మాత్రమే. అలాంటి భావాలని అర్ధం చేసుకోకలిగి, వాటిని ప్రేమించ కలిగిన వ్యక్తి మాత్రమే మనల్ని మనస్పూర్తిగా అర్ధం చేసుకోగలరు, ప్రేమించగలరు. 
  3. ఏదైనా పనిలో చూపించే వ్యతిరేకత (Negativeness), ఆ పనిని మాత్రమే, నాశనం చేస్తుంది. అదే వ్యతిరేక భావం  (Negativeness) మనిషిలో ఉంటే, మనం చేసే ప్రతి పనిని నాశనం చేస్తుంది. అదే జీవితపు వైఫల్యం అవుతుంది.  కాబట్టి, ఎప్పటికీ మనం ఏదైనా సాధించగలం అన్న నమ్మకం తోనే ముందుకు అగుగులు వెయ్యాలి. 
  4. నీ గురించి ఎవరికైనా చెప్తే బాగుంటుందేమో అన్న ఆలోచన వచ్చినప్పుడు, ఒక్క సారి ఆలోచించు. ఎందుకంటే, మనల్ని ఇష్టపడే వాళ్ళకి, మన గురించి వివరణ అవసరం లేదు. మనల్ని, ద్వేషించే వాళ్ళకి, మనం చెప్పే మాటల మీద నమ్మకం ఉండదు. 
  5. తెలివికలిగిన వాడు కొత్త పనులు మొదలు పెట్టి, వాటిని సాదించటానికి మార్గాన్ని, నియమించుకుంటాడు.  తెలివిని సంపాదించుకోవాలి అనుకునే వాడు, జరిగిపోయిన విషయాల యొక్క ఆధారాల కోసం అన్వేషిస్తుంటాడు.  మూర్ఖుడు ఎలాంటి ఆలోచనలూ లేకుండా అవతలి వ్యక్తుల మీద ఆరోపణలని, అపార్ధలని సృష్టిస్తుంటాడు 
  6. తప్పులూ, పొరపాట్లు జరగకుండా ఏ వ్యక్తైనా వున్నాడు అని అంటే, బహుశా అతను కొత్తగా ఏమీ ప్రయత్నించక పోయి ఉండవచ్చు. 
  7. మనం పరిస్థితులతో రాజీ పడి, వాటికి అనుకూలంగా వెళ్ళే కన్నా, పరిస్థితులని మనకి అనుగుణంగా మార్చుకుంటే, విజయ సాధనకి సులువైన మార్గాన్ని తయారు చేసుకున్న వాళ్ళము అవుతాము. 
  8. జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, మనం పూర్తిగా మంచీ చెడులని అర్ధం చేసుకోకలిగే సమయానికి జీవితపు చివరి దశకి చేరుకుంటాము. కాబట్టి,ఎంత త్వరగా మనిషి అసలైన జ్ఞానాన్ని సంపాదించుకోగలడో, అంత ఎక్కువ కాలం జీవితాన్ని అనుభవించగలడు. 
  9. జీవితం అనేది సమస్య కాదు పరిష్కారం కోసం వెతుక్కోవటానికి, జీవితం అనేది అద్బుతం. అనుభవించటానికి ఆస్వాదించటానికి మనకి దొరికిన గొప్ప అవకాశం. 
  10. ఒక రోజు మన జీవితం మొత్తం మన కనుల ముందు కదులుతూ కనిపిస్తుంది. ఆ రోజు అది చూడటానికి ఇష్టపూర్వకంగా ఉండేలాంటి పనులు చెయ్యటం మన చేతిలోనే ఉంటుంది. 
  11. ఆలోచిస్తూ మాత్రమే ఉండిపోతే, ఏ పనికీ అంకురార్పణ జరగదు. ఆచరించటం మొదలు పెట్టినప్పుడే ఫలితాన్ని పొందటం సాధ్యం అవుతుంది. అందుకనే, ఆలోచన మాత్రమే చేసే వ్యక్తితో 60 సంవత్సరాలు ఉండే కన్నా, ఆలోచనలని ఆచరణలో పెట్టే వ్యక్తితో 60 నిముషాలు వుండటం మిన్న (ఎందుకంటే, ప్రయత్నంతోనే సమాదానాలు సాధ్యపడతాయి). 
  12. మనిషిగా మన శరీరం ఈ భూమిపైన ఎన్నాళ్ళు తిరిగింది అనే దాని కన్నా, మనిషిగా మనం పంచిన ఆలోచనలు ఎందరి గుండెల్లో నిండి వాళ్ళని ముందుకు నడిపిస్తున్నాయి అనేది ముఖ్యం. 
  13. నూరేళ్ళు నువ్వు బ్రతికితే దీర్ఘాఇష్మంతుడువి అవుతావు. అదే నూరేళ్ళ బ్రతుకుని సంపాదించుకోవాలి అని భూమిపైకి వచ్చిన ప్రతి ఒక్కరి గుండెల్లో నువ్వు బ్రతకగలిగితే చిరంజీవివి అవుతావు. 
  14. మనం మనసు పెడితే, మనిషిగా బ్రతకగలిగితే జీవితం లో చావు అనే శత్రువుని పూర్తిగా నాశనం చెయ్యవచ్చు. దానిని నాశనం చెయ్యకలిగిన ఆయుధం  మనం సంపాదించుకునే కీర్తి మాత్రమే. 
  15. చావు మనిషిని మాత్రమే దూరం చెయ్యగలదు. మనసుతో ముడి పడిన ఎలాంటి బందాలని, అనుబందాలని దూరం చెయ్యలేదు. 
  16. మనం జీవితం గురించి ఎంత భయపడుతున్నాము అంటే, అంతగా మనం మన చావుని ప్రేమిస్తున్నాము అని అర్ధం. ఎప్పటికైనా తప్పని విషయాన్ని గురించి ప్రేమని పెంచుకుంటూ. ప్రస్తుతం నడిపిస్తున్న జీవితాన్ని నిర్లక్ష్యంగా వదిలెయ్యటం మూర్ఖత్వం అవుతుంది. 
  17. మన బలం మనపై మనకి ఉన్న నమ్మకమే. అలాంటి నమ్మకాన్ని అందరిలో పెంచగలిగిన మనిషి మాత్రమే మంచి నాయకుడు కాగలడు. 
  18. ప్రయోగానికి భయపడి, ఫలితం ఉండదు అని తప్పుకునే కన్నా. ప్రయత్నించి వచ్చిన ఆటంకాలని రాసుకుంటే, వెరొకరైనా దానిని సాదించటానికి ఒక మార్గం చూపించిన వాళ్ళము అవుతాము. 
  19. నువ్వు చుసిన నిన్న నీకు బాధని పరిచయం చేసి ఉండవచ్చు అలాఅని, నువ్వు చూడని నీ భవిష్యత్తు కూడా అలాంటి అనుభవాల్నే పంచుతుందేమో అని భయపడి ప్రస్తుతాన్ని కన్నీటిమయం చేసుకోకు. ఎందుకంటే, కన్నీటి తెరతో నిండిన కల్లు వాస్తవాన్ని చూడలేవు. 
  20. ఎవరైనా మనల్ని ఏమి సాదిన్చావు అని అడిగితే, కనీసం ప్రయత్నించాను అని కూడా చెప్పలేక పోయినప్పుడు ఆ జీవితానికి విలువ ఉండదు. ఎందుకంటే, ప్రయత్నించిన ప్రతి వ్యక్తీ తానుగా విజేత కాకపోవచ్చు, కానీ, ఒక విజేతకి మాత్రం తప్పకుండా మార్గదర్శి అయివుంటాడు.  
  21. వెళ్ళే దారి ఎంత అందంగా ఉన్నా, ఆ అందాలని, ఆనందాలని పంచుకోకలిగే మరో వ్యక్తి పక్కన లేకపోతే ఆ ప్రయాణం ఎంతో భయంకరంగా ఉంటుంది.  
  22. శరీర ఆకారం మారొచ్చు, మొహం లో ఉన్న అందం తగ్గవచ్చు, మనిషి ఆకృతి, ఆకర్షనీయతని కోల్పోవచ్చు. కానీ, మానసిక సౌదర్యానికి, మనిషి మంచితనానికి మాత్రం వృద్దాప్యం ఉండదు. 
  23. ఎప్పుడూ, మన వైపు నుంచి మాత్రమే, ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే, అవి అన్ని సందర్భాలలో మంచిని  ఫలితంగా ఇవ్వకపోవచ్చు. కాబట్టి, నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాలి. 
  24. మంచిలోనైనా, చేడులోనైనా మన చెయ్యి వదలకుండా మనతో నడిచే వాళ్ళు, మనల్ని సరిదిద్దే వాళ్ళే మన వాళ్ళు . 
  25. మనం మాట్లాడే మాటలు, చేసే పనులు మాత్రమే, మనల్ని పదిమంది ప్రేమించాలా, లేక ద్వేషించాలా అని నిర్ణయిస్తాయి. 
  26. నిజం ఐనా లేక అబద్దం ఐనా, మనకి మంచిని చెయ్యవచ్చు, లేదా చెడుని చెయ్యవచ్చు. అది మనం ఉపయోగించే ప్రదేశాన్ని బట్టి దాని ఫలితం మారుతుంది. 
  27. నిజం అనేది ఏ ఒక్కరి సామర్ధ్యాన్ని పట్టి మారదు. మనం అవతలి వ్యక్తి తో ఎంత వరకు నిజాయితీగా ఉండగలమో, అంత దూరం వరకూ, నిజం ప్రయాణం మనతో కొనసాగుతుంది. 
  28. నిజమై నడిచి రేపటి రోజుకి తోడుగా నడుస్తావు అనుకుంటే, కలగా మారి నిన్నటి  జీవితానికి జ్ఞాపకమై నిలిచావు. 
  29. పది మంది నడిచే దారి మంచి దారి కాదు. అలా అని, ఒక్కడే నడిచే దారి చెడ్డ దారి కూడా కాదు. 
  30. నిజాన్ని చూడలేని కళ్ళకి, ప్రేమని స్వీకరించే హృదయం ఉండదు. 
  31. మన  ప్రేమని అవతల వ్యక్తి అర్ధం చేసుకోలేక పోతున్నారు అంటే అర్ధం, మనకి ప్రేమించటం రాదు అని కాదు. అవతల వ్యక్తికి ప్రేమని స్వీకరించగలిగే మనసు లేదు అని. 
  32. మనం మన లాగా ఉండటమే మనకి గౌరవం. 
  33. తన జీవితాన్ని తెలుసుకుని నలుగురికి మార్గం చూపించ గలిగేవాడు మనిషి. తనతో పాటు ఎదుటివారి జీవిత అనుభవాలని కూడా తెలుసుకుంటూ నలుగురికి మార్గం చూపించ గలిగేవాడు కవి. 
  34. కష్టం వచ్చినప్పుడు కన్నీళ్ళని తుడిచే వాళ్ళు, భయ పడే క్షణంలో ధైర్యం చెప్పే వాళ్ళు, బాధల్లో ఉన్నప్పుడు, బాధ్యతగా తోడునడిచే వాళ్ళు, అన్ని సందర్భాలలో ఆప్యాయంగా అక్కున చేర్చుకునే వాళ్ళు మాత్రమే మంచి జీవిత భాగస్వామి కాగలరు. 
  35. జనం మర్చిపోతారు కదా అని మంచిని చెయ్యటానికి ఆలోచించకు. మనం మట్టిలో కలిసిపోయే క్షణంలో కూడా గుండెల్ని కదిలించేది, జ్ఞాపకంలా నిలిచిపోయేది, నలుగురికి చేసిన ఆ మంచి  మాత్రమే. 
  36. అబద్దాలని నమ్మటానికి సిద్దంగా ఉన్నప్పుడు మాత్రమే, మోసపోవటం జరుగుతుంది కాబట్టి, ఎవరైనా మనల్ని నమ్మించి మోసం చేస్తున్నారు అంటే, ఆ తప్పు వాళ్ళది కాదు. మోసపోఏటంతలా నమ్మిన మనదే. 
  37. ఎలాగైతే నది ప్రవాహంలో ఈదలేని వాడు శవంలా కొట్టుకుపోతాడో, అలానే జీవితపు పరీక్షలలో ధైర్యం, వివేకం చూపింఛి పోరాడలేని వాడు, శాశ్వతంగా చీకటిలోనే ఉండిపోతాడు. 
  38. ఎవరితో ఏదీ పంచుకోకు అని అన్న నా మాటలో బావం, నువ్వు ఒంటరిగా వుండాలి, ఎవరికీ దగ్గర కాకూడదు అని కాదు. ఎక్కువగా ఎవరికైనా దగ్గరైతే, దూరం కావలిసిన క్షణంలో తట్టుకోలేవేమో అన్న నా చిన్న భయం మాత్రమే. 
  39. అమ్మ అనే మాట కేవలం ప్రేగు బంధం తోనే ముడిపడిన సంబంధం కాదు. ఆ ఒక్క పదమే ప్రేమ బంధం తో ముడి పడిన మనిషి యొక్క ఆప్యాయతల నడుమ కొనసాగే బాధ్యతలను తెలిపే మానవాతీతర సంబంధం. 
  40. ప్రేమని పంచే మనిషి చేతిని జీవితం చివరి వరకు విడవకూడదు. అదే ప్రేమని పంచిన మనసు తోడుని చితిలో కాలిపోయే క్షణంలో కూడా విడవకూడదు. 
  41. మనసుకి అవధులు లేవు. అందుకనే అతిగా ప్రేమిస్తుంది. కానీ, మనుషులు గీసుకున్న కట్టుబాట్ల అవదుల మధ్య తనని తాను సమర్ధించుకోలేక పరితపిస్తుంది. 
  42. నీకు తెలియని ప్రపంచం లోకి రావాలి అని, తల్లి కడుపులో నుంచి బయటకి వచ్చే ప్రయత్నం చేసిన నిన్నటి నీ ధైర్యాన్ని గుర్తు పెట్టుకోగలిగితే, రేపటి రోజున ఎదురయ్యే ప్రతి జీవితపు సమస్యకి పరిష్కారం సులువుగా వెతుక్కోగలుగుతాము . 
  43. అందరూ మన జీవితంలో ఉండిపోరు. కొందరు మన జీవితంలో నేర్చుకోవలసిన పాటాలను నేర్పిస్తూ వెళ్ళిపోతారు. 
  44. గెలిచినప్పుడు ప్రశంసించే వాళ్ళ కన్నా, ఓడిపోయినప్పుడు విమర్శించే వాళ్ళ కన్నా, ప్రయత్నించేటందుకు ప్రోత్సహించే మంచి హృదయం మిన్న. 
  45. క్షణ కాలం మనల్ని లొంగదీసుకునే కోపాన్ని అదుపుచేసుకోలేకపోతే, జీవితాంతం మనతో తోడు రావలసిన ఆనందాన్ని మనమే దూరం చేసుకునే వాళ్ళము అవుతాము. 
  46. పొరపాట్లు కాని, తప్పులు కాని  చేయని వ్యక్తి జీవితం నుంచి మనం ఏమి నేర్చుకోలేము.  ఎందుకంటే, మనం ఏదో చెయ్యటానికి ప్రయత్నిస్తున్నాము అని తెలియచేసేవి అవే కాబట్టి. 
  47. మనం చేసిన చెడ్డ పనులను తలుచుకుని బాధపడటం కన్నా, చెయ్యగలిగి వుండి కూడా, చెయ్యలేని లేదా చెయ్యని మంచి పనులను తలచుకుని సిగ్గుపడాలి. 
  48. ఒకరి ప్రవర్తనని ఆధారం చేసుకుని, నువ్వు నీ గమ్యాన్ని కాని, ఆలోచనలని కాని నిర్దేశించుకోకూడదు. పది మందిని కలుపుకు పోగలిగే తెలివి మనకి వుండాలి కాబట్టే, మనల్ని మనుషులుగా పుట్టించాడు.  కాబట్టి, మనం మన లాగ ఉండటమే జీవితం. 
  49. పోగుట్టుకున్న దానిని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండిపోతే, సాదించాల్సింది ఏమిటో గుర్తుపెట్టుకోలేము. దాని వలన జీవితం లో శూన్యం లా మిగిలిపోతాము. 
  50. పుట్టుక తప్ప మరణం లేని బంధం, మనసుతో ముడిపడిన ప్రేమ బంధం. 
  51. పెళ్ళి అనేది మనం ఒక వ్యక్తితో బ్రతకగలము అని చేసుకునేది కాకూడదు. మనం తను లేకుండా ఉండలేము, తనతోనే మన సంతోషము అని తెలిపిన మనసుతో ముడి వేసే బంధం కావాలి. 
  52. మనసు భావాలని ప్రతిభింబింప చేయగలిగిన కవి కలము నుంచి జాలువారే అక్షరాలకి సైతం అందని, ఎన్నో అందమైన అనుభూతుల జీవన సారం మన జీవితం.  అదే నిన్నటి రోజుకి జ్ఞాపకం. రేపటి రోజుని మేలు కొలిపే ఆశా కిరణం. 
  53. నీ అడుగుల చప్పుడు కోసం ఎదురుచూసే ఒక మనసు ఉంది అన్న చిన్న ఆశ కన్నా మనిషికి పెద్ద ఆనందం ఏది ఉండదు.  
  54. ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా ఉన్న క్షణంలో కూడా, నీ చేతిని వీడని తోడుని నేను అని తెలిపేదే భార్యా భర్తల బంధం. 
  55. నీ జీవిత కాలం నూరేళ్ళు అయితే, నా జీవితం దాని కన్నా ఒక్క క్షణం ఐనా తక్కువ గా ఉండాలి అని కోరుకునే వాళ్ళే భార్యా భర్తలు. ఎందుకంటే, నిజమైన ప్రేమ లో ఒకరిని విడిచి ఇంకొకరు ఒక్క క్షణం కూడా ఉండలేరు. ఒకరి మరణాన్ని ఇంకొకరు చూడలేరు. 
  56. మనిషిలో పరివర్తన తీసుకురాలేని చదువు, తెలివైన దెయ్యాన్ని తయారు చెయ్యటానికి తప్ప ఎందుకూ పనికి రాదు. 
  57. ఎలా ఆలోచించాలో తెలుసుకోవాల్సిన వయసు, పసి వయసు. ఏమి ఆలోచించాలో తెలుసుకోవాల్సిన వయసు యుక్త వయసు. ఆలోచనల అనుభవాలని పంచాల్సిన వయసు ముసలి వయసు.  ఈ విషయం గ్రహించగలిగిన మనిషి మాత్రమే జ్ఞాని కాగలడు. 
  58. ప్రపంచాన్ని మార్చటానికి, జ్ఞానానికి మించిన ఆయుధం లేదు. 
  59. పరుగు పందెంలో పాల్గున్న వ్యక్తి, ఏ కారణం చేతనైనా మధ్యలో కూర్చుంటే, ఎలాగైతే వెనక వాళ్ళు మనల్ని దాటి ముందుకి వెళ్ళిపోతారో, అలానే జీవితం పెట్టే ప్రతి పరీక్షలో పాల్గొనాల్సిన మనం అలసట, అవివేకం, భయం, అపనమ్మకం, నిర్లక్ష్యం, ఆవేశం అనే ఆరు వ్యసనాలలో ఏ ఒక్క దానికైనా లొంగిపోతే, గెలవటం అనేది కష్టమే కాదు, అసాధ్యం కూడా. 
  60. కాలాన్ని మనం గుర్తుపెట్టుకునేలా బ్రతికే బ్రతుకులో అర్ధం వుండదు. కాలం మనల్ని గుర్తుంచుకునేలా బ్రతకగలిగినప్పుడే ఆ జీవితానికి అర్ధం. 
  61. నమ్మకం అనే ఒక్క ఆయుధం మనతో ఉంటే, జీవితంలో ఏదైనా సాధించవచ్చు. 
  62. కాలంతో కలిసిపోయిన అనుభవాలు, జ్ఞాపకాలుగా మారి మనతోనే తోడు వస్తాయి.  అలాంటి మంచి అనుభవాలు, మనం మెలుకువగా వున్నప్పుడు మాత్రమే సంపాదిన్చుకోగలము.  
  63. మొదలు పెట్టాలి అన్న ఆలోచనే రానప్పుడు, లేనప్పుడు, గెలుస్తాము, గెలవగలుము అన్న మాటలే ఉండవు. కాబట్టి ఏదైనా పని ఎలా పూర్తి చెయ్యగలుగుతామో ఆలోచించాలి  కాని, అసలు చెయ్యాలా వద్దా అని కాదు. 
  64. జీవితం అనేది మనం సంపాదించుకుంటూ, మనం బ్రతకటం కాదు. మనం బ్రతుకుతూ నలుగురికి బ్రతికించటం. 
  65. ఒక మనిషిని అర్ధం చేసుకోవటానికి జీవితం సరిపోదు. కానీ, అదే మనిషిని అపార్ధం చేసుకోవటానికి ఒక్క క్షణం లేదా ఒక్క పదం సరిపోతుంది.  
  66. మనకి ఉన్న పలుకుబడి మనల్ని ఇతరులు గుర్తుంచుకునే విధంగా చేస్తుంది. అదే, మనకి అవతలి వాళ్ళు ఇచ్చే ప్రశంసలు, మనకి మనం ఏంటో గుర్తుండేలా చేస్తాయి.
  67. ఒక విషయం మన జీవితం అని తెలుసుకోలేని పరిస్థితిలో మనం దగ్గరైన బంధం ఉంది అంటే, ఆ క్షణపు బాధ లోతుకి ముగింపు కూడా ఉండదు. 
  68. తల్లి దండ్రులు సంపాదించిన కోట్లతో జీవించే జీవితంలో ఉన్న ఆనందం కన్నా, మనం సంపాదించుకున్న 10 రుపాయిలతో జీవించే జీవితంలో ఉన్న ప్రశాంతత మిన్న. 
  69. ఒక మనిషి యొక్క సంస్కారం, తను మాట్లాడే మాటల్లో, చేసే చేతల్లోనే తెలిసిపోతుంది. 
  70. కొత్త బంధాలని జీవితంలోకి ఆహ్వానించటం ఎంత ముఖ్యమో, పాత బంధాలతో ముడి పడి ఉన్న అనుబంధాలని నిలబెట్టుకోవటం కూడా అంతకంటే ముఖ్యం. 
  71. భార్యా భర్తల మధ్య ఉన్న అనుబంధం గడుస్తున్న జీవితంలో దీపంలా ఉండాలి కాని,  గడిచిపోయిన జీవితంలో జ్ఞాపకం లా మిగిలిపోకూడదు. 
  72. కొన్ని సార్లు అవతల వ్యక్తి మనస్తత్వం గురించి తెలుసుకోకుండా ఉంటేనే, మనం సంతోషంగా ఉండకలుగుతాము. 
  73. భయం ధైర్యం మనతోనే ప్రయాణం సాగించేవి ఐనా, భయానికి లొంగినంతగా మనిషి ధైర్యానికి కట్టుపడలేడు. ఎప్పుడైతే, మనిషి ధైర్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడో, అప్పటినుంచే జీవితంలో అనుకున్నవి సాదించటం మొదలుపెట్ట కలుగుతాడు.  
  74. దేవుడు ఇచ్చిన మరుపుని మంచిని మర్చిపోవటానికి వాడుకుంటూ, మర్చిపోవాల్సిన చెడుని మాత్రం మనతోనే చివరి వరకు తోడు తీసుకుని వెళ్తున్నాం. 
  75. ప్రేమతో నేను రాసిన ఏ ఒక్క అక్షరంలోని భావాన్ని తెలుసుకోలేకపోయావు. బాధతో నేను రాసే ప్రతి ఒక్క అక్షరాన్ని చూసి నవ్వుకుంటున్నావు. బంధం అనేది మనం ఎలా తీసుకోవాలి అనుకుంటే, అలానే కనిపిస్తుంది. నీ చేతిలోనే ఉంది నీకు నాకు మధ్య ఉన్న అనుబంధపు బలం. 
  76. మనకి ఉన్న పలుకుబడి మనల్ని ఇతరులు గుర్తుంచుకునే విధంగా చేస్తుంది. అదే, మనకి అవతలి వాళ్ళు ఇచ్చే ప్రశంసలు, మనకి మనం ఏంటో గుర్తుండేలా చేస్తాయి. 
  77. చెక్కే కొద్ది నొప్పి పుడుతుంది కదా అని శిల్పి శిల్పాలని చెక్కడం ఆపేస్తే, అందాలకి ఆయుష్షు తగ్గిపోతుంది. అలానే, కాలం పెట్టే పరీక్షలకి తట్టుకోలేకపోతున్నారు కదా అని, దేవుడు మనిషికి ఆలోచనా జ్ఞానాన్ని తగ్గిస్తే, జీవితం కి  విలువ లేకుండా పోతుంది. 
  78. అమ్మ కడుపులో ఉన్న పసి పాపకి రక్షణ ఎక్కువ. అలా అని అక్కడే జీవిత చక్రం ఆగిపోతే, సృష్టి రహస్యాలకి సాధన శూన్యం. 
  79. తను చెప్పేది నిజం ఐనా, లేక అబద్దం ఐనా మనిషి తన మనసు మాట ని వినే నడుస్తాడు.  అలాంటి మనసు యొక్క భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకో కలిగిన వాడే జీవితాన్ని జయించగలగుతాడు. 
  80. సాధించాలి అన్న తపన ఉన్నప్పుడు మాత్రమే, మనం మన లక్ష్యాన్ని చూడ కలుగుతాము. 
  81. చీకటిలో ఉన్నప్పుడే దీపపు వెలుగు అవసరం తెలుస్తుంది. అలానే, ఒంటరిగా ఉన్నప్పుడే, ఇంకొకరి తోడు లో వున్న అనురాగం విలువ తెలుస్తుంది. 
  82. ఓటమిని పొందిన వాడు జీవితం లో ఏ మెట్టుని ఎక్కలేదు అని అనుకోలేము. గెలిచిన వాడు జీవితం లోనే ఎతైన శిఖరం లో వున్నాడు అని కూడా చెప్పలేము. గెలుపు నుంచి కానీ, ఓటమి నుంచి కానీ ఎలాంటి పాటం నేర్చుకోలేని వాడు, నేర్పించలేని వాడు, జీవించి వున్నా లేనట్లే. 
  83. ఇది సాదించలేక పోయామే అని ఎప్పుడు అనుకోకూడదు. మనం ఆచరించిన విదానం వళ్ళ మాతమే అది కుదరక పోయి ఉండవచ్చు అని అనుకోవాలి. 
  84. రేపటికి జ్ఞాపకాలని దాచుకోవాలి అని అంటే, ఈ రోజు అంటూ మనం, మన జీవితాన్ని జీవించటం నేర్చుకోవాలి. 
  85. ఆకర్షణీయపు అబద్దాలకి లొంగకుండా, నిష్టూరపు నిజాలకి కుంగకుండా ఉన్నపుడే, మనసు కోరే ఆలోచనల విజయ సౌదాన్ని (గమ్యాన్ని) చేరుకో కలుగుతాము. 
  86. మనం మన గడిచిపోయిన జీవితాన్ని అర్ధం చేసుకుంటూ..., గడవబోయే (రాబోయే) జీవితాన్ని అందంగా, అర్ధవంతంగా మలుచుకోవాలి. 
  87. జీవితం అనేది చాలా ఖఠినమైనది. మనం మూర్ఖముగా ఆలోచిస్తూ ఉంటే అది మరింత ఖఠినంగా కనిపిస్తుంది. కాబట్టి, జీవితాన్ని ప్రేమించటం నేర్చుకో. జీవితం మరింత ప్రేమని మన ముందుకు తెస్తుంది.
  88. కృంగదీసే, గడిచిపోయిన చేదుని తలుచుకుని బాధపడటం కన్నా, ప్రోత్సహించే అభినందలని తలుచుకుని ముందుకు సాగిపోవటం మిన్న.
  89. వచ్చేటప్పుడు మనతో తోడు వచ్చింది ఎవరూ లేరు.  వెళ్ళేటప్పుడు మనతో తోడు వచ్చేది కూడా ఎవరూ లేరు. అలాంటప్పుడు మధ్యలో మనకి తోడు ఎవరూ లేరు అని అనుకోవటం వలన భారం తప్ప ఏమీ ప్రయోజనం ఉండదు.
  90. నేనై బ్రతికే బ్రతుకులో అర్ధాన్ని మొత్తం, మనం అన్న మాటలో చూసుకో కలగటమే జీవితం. 
  91. ఒక్కరిగా ప్రయాణం మొదలు పెడుతున్నాం అంటే అర్ధం, ఒక్కరిగానే ప్రయాణం పూర్తి చేస్తాం అని అర్ధం కాదు. అందుకనే, ఒంటరి ప్రయాణం లో భారం ఎక్కువైనా, బాధ్యత కూడా అంతే ఎక్కువ. 
  92. మనమై బ్రతికితేనే మమతల విలువ తెలుస్తుంది అని అనుకోవటం అన్ని సందర్భాలలో నిజం కాకపోవచ్చు.  ఎందుకంటే, మనం అనేది మనుషుల సంఖ్యను మాత్రమే చూపించేది కాదు.  మనం అనేది, మనలో నిండిన ఆప్యాయతల్ని చూపించేది. 
  93. మనిషిని పలకరించే మనుషుల మాటలు చేసే గాయాలు క్షణాల్లో కరిగిపోతాఏమో కానీ,
    మనసుకి చేరువైన మనుషుల మాటల్లో భావాలు మాత్రం ప్రాణం ఉన్నంత వరకు నిలిచిపోతాయి .
  94. జీవితం అనేది చెరిపి గీసే అవకాశం లేని ఒక అందమైన చిత్రపటం. కాబట్టి వేసే ప్రతి ఒక్క అడుగులో జాగ్రత అవసరం.
  95. జీవితాన్ని మనం పీల్చే గాలి పరిమాణాన్ని బట్టి కొలవలేము. మనం సంపాదించుకున్న కీర్తితో మాత్రమే కొలవగలుగుతాము.   
  96. ఒక్కొక్కసారి చిన్న చిన్న నిర్ణయాలు కూడా మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి.
  97. సుఖాన్ని ప్రేమించినంత ఇష్ఠముగా కష్ఠాన్ని ప్రేమించటం తెలుసుకుంటే, జీవితాన్ని గెలవగలిగే ఆత్మవిశ్వాసం వస్తుంది.
  98. బడిలో నేర్చుకున్న పాఠాలకి పరీక్షలు రాస్తే, జీవితంలో జరిగే పరీక్షలకు పాఠాలు నేర్చుకుంటాము.
  99. మనం మన తప్పులకి ఇచ్చుకునే  మరో పేరే అనుభవం. అలాంటి అనుభవాల సారం మన జీవితం .
  100. మనిషి ఎదుగుదల పుట్టుకతో మొదలౌతుంది. మనిషి పతనం చావుతోనే ముగుస్తుంది. మధ్యలో వున్న కాలం అంతా నీ కీర్తికి ఆధారం అవుతుంది .
  101. నిన్నటి నీతో, ఈ రోజు నీ ఆలోచన పోటి పడితే, రేపటి నీకు విజయం కలుగుతుంది 
  102. కన్నీటితో కడిగిన కళ్ళు, జీవితంలో స్వచ్చమైన వెలుగుని చూడ గలుగుతాయి. కాబట్టి బాధని చూసి భయపడకు.
  103. శక్తికి మించిన పరుగులతో ఉప్పునీటి సంద్రం కావటం కన్నా, ఆలోచనతో నిదానించి మంచినీటి కాలువగా మిగలటం మిన్న.